కల్తీ మద్యం తయారీ విషయంలో ఇంటి దొంగల పాత్ర గుర్తించడంపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి మునకలచెరువు సీఐ హిమ బిందుపై వేటు వేసింది. ఇప్పుడు కేసులకు కీలక నిందితుడు జనార్దన్ బార్, అదే విధంగా కల్తీ మద్యం తయారీ డంప్ బయటపడిన పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న గోపాలకృష్ణ తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు అని సమాచారం. సీఐ పరిధిలో జనార్ధన్, అతని అనుచరుడు కళ్యాణ్ స్థానిక శ్రీనివాస వైన్స్‌లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం అమ్మకాలు జరిపినట్టుగా కూడా అధికారులు గుర్తించారు.
ఇంత జరుగుతున్నా కల్తీ మద్యం వ్యవహారం గుర్తించకపోవడంపై సీఐ గోపాలకృష్ణపై ఎక్సైజ్ శాఖ అధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు స్టేషన్ పరిధిలో కొందరు సిబ్బంది బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని, అండగా నిలుస్తున్నారని ఇప్పటికే గుర్తించారు. వీరిలో కల్తీ ఆమ్మకం జరుపుతున్న కొందరికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో శాఖా పరంగా అంతర్గత విచారణ చేపట్టారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవటానికి ఎక్సైజ్ కమిషనర్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
Also Read: AP Cabinet Meeting: కేబినెట్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!
మరోవైపు కల్తీ మద్యం కేసుకు సంబంధించి నిందితుడుగా ఉన్న కళ్యాణ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్ పిన్ని కుమారుడే కళ్యాణ్. ఏడాది క్రితమే శ్రీనివాస వైన్స్ మేనేజర్‌గా చేరాడు. కల్తీ మద్యం వారానికి 50 కేసులు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. జనార్ధన్ బార్‌లో కల్తీ మద్యం గుర్తించిన విషయం తెలియగానే వైన్స్‌లో ఉన్నటువంటి 60 కేసులు మధ్యన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. ఇటీవల గొల్లపూడిలో 3 కోట్ల భూమి కొన్నట్టు సమాచారం రావటంతో కళ్యాణ్ ఆర్ధిక లావాదేవీలు అధికారులు పరిశీలిస్తున్నారు.