AP EAPCET Starts From Today: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. అభ్యర్థులు గోరింటాకు పెట్టుకుంటే బయోమెట్రిక్‌కు ఇబ్బందులు రావొచ్చని పేర్కొన్నారు. అభరణాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరని ఆయన తెలిపారు.
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ… ‘ఏపీ ఈఏపీసెట్ ఈ నెల 16 నుంచి 23 వరకు జరుగుతుంది. బైపీసీ విద్యార్థులకు 16, 17 తేదీల్లో నాలుగు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎంపీసీ విద్యార్థులకు 18 నుంచి 23 వరకు తొమ్మిది విడతల్లో పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో విడత పరీక్ష ఉంటుంది. ఈసారి 3,61,640 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. హాల్‌టికెట్ వెనుక భాగంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి రూట్ మ్యాప్ ఇచ్చాం’ అని తెలిపారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
‘నంద్యాలలో పరీక్ష కేంద్రాలను మార్పు చేశాం. మొదట ఆర్‌జీఎంఐటీ, శాంతిరామ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాం. వాటిల్లో ఈవీఎంలను భద్రపరచడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ రెండు కళాశాలల్లో కేంద్రాలున్న వారికి శ్రీరామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశాం. పాత కేంద్రాలతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారు కొత్త హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది’ అని హేమచంద్రారెడ్డి చెప్పారు.