NTV Telugu Site icon

Kolagatla Veerabhadra Swamy: ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా..? జూ.ఎన్టీఆర్‌ని అణగదొక్కలేదా..?

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy: ఏపీ స్కిల్‌ స్కామ్‌, అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు, చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభా సమావేశాల సమయాన్ని టీడీపీ సభ్యులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కేసులను ఎత్తివేయమని శాసనసభా సమావేశాల్లో అడగడం అవివేకమన్న ఆయన.. టీడీపీ సభ్యులు కవ్వింపు చర్యలకు దిగారు. సభను సక్రమంగా నడవనీకుండా ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం సృష్టించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటకు రావాలి అని సవాల్‌ చేశారు. తన కేసులపై ఉన్న స్టే అన్నింటిపైన విచారణ జరిపి కడిగిన ముత్యంలా బయటకు రావాలని సూచించారు.

ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో చంద్రబాబు సభ్యుడా? అని ప్రశ్నించారు కోలగట్ల.. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా? అని మండిపడ్డ ఆయన.. లోకేష్ కు అడ్డుగా ఉన్నాడని.. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని స్టేలు ఎత్తి వేయించుకొని విచారణ జరిపించుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి.. ఇంకా మూడు రోజులు సభ జరుగుతుంది టీడీపీ సభ్యులు చెప్పాల్సింది సభకు వచ్చి చెప్పండి అని సలహా ఇచ్చారు. సీఐడీ కస్టడీలో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి అన్నారు కోలగట్ల వీరభద్రస్వామి.

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఖండిస్తున్నా.. అసెంబ్లీని ప్రక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ పనిచేసింది.. మితిమీరిన ప్రవర్తన కలిగిన సభ్యులను సస్పెండ్ చేశారు.. స్పీకర్ పై దౌర్జన్యం చేసేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని దుయ్యబట్టారు కోలగట్ల.. తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ కవ్వింపు చర్యలకు దిగారు.. సభ జరగకుండా ప్లాన్ చేశారు అని అర్థం అయిన తరువాత సభ్యులను సస్పెండ్ చేశారని విరించారు. అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు నిజాయితీని బయటపెట్టే అవకాశం ఉన్నా.. దానిని చేజార్చుకున్నారని.. అసెంబ్లీలో చర్చకు సహకరించ లేదు అంటే అవినీతి జరిగిందని టీడీపీ సభ్యులకు తెలుసని కామెంట్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు.. అతన్ని విచారణ కోసం టీడీపీ పిలిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఏ మారుమూల దాక్కున్నా తీసుకువస్తారు.. శాసనసభ లో మాట్లాడకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి.