Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. కీలకమైన శాఖలను తీసుకున్న పవన్.. వరుసగా ఆ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, ఏ శాఖలో చూసినా నిధులు లేవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి.. జలజీవన్ మిషన్‌పై మాట్లాడుతున్న పవన్.. ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందజేయడం తన లక్ష్యం అంటున్నారు.. అందులో భాగంగా.. ఢిల్లీలో జరగనున్న జలజీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్..
Read Also: Tollywood : మైథలాజీకల్ కథల పై టాలీవుడ్ దర్శకుల మోజు..!
కాగా, ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఈ పథకంలో క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై కేంద్రం దృష్టి సారించింది.. అందులో భాగంగా.. ఈ నెల 19వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. ఈ భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.. అయితే, గత ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోలేదని.. రాష్ట్ర వాటా నిధులు సరిగా కేటాయించని కారణంగా పనుల నిర్వహణపైనా తీవ్ర ప్రభావం చూపిందని.. తను నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. ప్రతిపాదిత పనుల్లో ఇప్పటికీ సగం కూడా పూర్తికానట్టు పవన్ గుర్తించారు.. ఇక, ఈ పథకాన్ని గాడిలో పెట్టి.. ప్రతీ ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్.. తొలిసారి కేంద్ర మంత్రితో నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరుకానుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు.. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు తిరిగి రానున్నారు.. ఎల్లుండి పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు.