NTV Telugu Site icon

Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి, మరాఠా పరాక్రమానికి చిహ్నంగా, సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులతో, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతూ, తన వీర స్ఫూర్తిని నిలబెట్టే మహారాష్ట్ర శ్రేయస్సు, పురోగతి కోసం తాను ప్రార్థిస్తున్నానన్నారు. దిగ్గజ నాయకుడు బాలాసాహెబ్ థాకరే జీని కూడా తాను గుర్తుంచుకుంటానన్నారు. ఆయన నిర్భయ నాయకత్వం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిని నింపిందన్నారు.

Read Also: Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం..

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహారాష్ట్ర నుంచి పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులు రైల్ స్టాప్ లేకపోవడంతో పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే శాఖతో చర్చిస్తానని, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పిఠాపురంలో రైళ్లు ఆగేలా చూస్తానని హామీ ఇస్తున్నానన్నారు. తన లాతూర్ సందర్శన సమయంలో తిరుమలలో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం లాతూర్ నుండి తిరుపతికి నేరుగా రైలు, విమాన సేవల కోసం తనకు అభ్యర్థనలు వచ్చాయన్నారు. వీలైనంత త్వరగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మార్గనిర్దేశం చేసే ‘ఎన్డీఏ మహాయుతి’ కూటమికి మద్దతు ఇవ్వాలని తాను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అద్భుతమైన విజయాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నారు. మహారాష్ట్ర వారి పాలనలో ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నారు.