NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలుపుతూ పవన్‌ కల్యాణ్ ట్వీట్‌ చేశారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారని అన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమన్నారు.

Read Also: Godavari-Sabari: గోదావరి-శబరి నదుల ఉగ్రరూపం.. విలీన మండలాల్లో టెన్షన్‌ టెన్షన్..

పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని.. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలని ఆయన అన్నారు. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అంటూ గుర్తు చేసుకున్నారు. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయన్నారు.

మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం గారి జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని పవన్ స్పష్టం చేశారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని.. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయన్నారు.

Read Also: Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..

ఏపీ ప్రభుత్వం పలు పథకాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. విద్యా వ్యవస్థలోని పలు పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని పలు పథకాలకు కొత్త పేర్లు పెడుతున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. జగనన్న అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం.. జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర.. జగనన్న గోరుముద్ద స్థానంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం.. ‘మన బడి నాడు-నేడు’ స్థానంలో ‘మన బడి-మన భవిష్యత్తు’ పేర్లను ఖరారు చేశారు. స్వేచ్ఛ పథకం స్థానంలో ‘బాలికా రక్ష’.. జగనన్న ఆణిముత్యాలు స్థానంలో అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం పేర్లను ఖరారు చేసినట్లు మంత్రి వెల్లడించారు.