Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్‌ వార్డు ఏర్పాటు!

  • కోవిడ్-19 పరిస్థితులపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
  • వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించిన మంత్రి
  • రాజమహేంద్రవరంలో ప్రత్యేక కోవిడ్‌ వార్డు ఏర్పాటు
Coronavirus Ap

Coronavirus Ap

AP Covid-19 Alert: ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కొవిడ్‌-19 పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించిన మంత్రి.. కొవిడ్‌ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయో నిరంతరం పర్యవేక్షిస్తూ.. కేసుల సంఖ్య పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్యశాఖ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

అలాగే వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి, అవసరమైన సూచనలు జారీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిధిలో ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహమ్మారి విషయంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరిస్థితిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజల సహకారంతో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.