Ambedkar Statue: విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 18 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసి అందులో 206 అడుగులున్న అంబేడ్కర్ మహాశిల్పాన్ని సీఎం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. పీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. విజయవాడలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం రూ.404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. పీఠంపై జీ ప్లస్ 2 తరహాలో గదులు నిర్మించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యకమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Read Also: CM YS Jagan: మరణం లేని మహానేత అంబేడ్కర్: సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని వెల్లడించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. అంబేడ్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని అన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శలు గుప్పించారు.