YSR Aasara Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆసరా పథకం నిధుల విడుదలకు సమయం ఖరారైంది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్ సర్కారు.. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Andhrapradesh: చర్చలు సఫలం.. నేటి నుంచి విధుల్లోకి అంగన్‌వాడీలు
ఉరవకొండలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ పర్యటన కోసం.. నేడు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్ జగన్.