Adudam Andhra Program Launch Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు ఉంటాయి.
ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. కోటి 22 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రీడాకారులు 34.19 లక్షలు కాగా.. ప్రేక్షకులు 88.66 లక్షల మంది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ఉంటాయి. బహుమతుల కోసం 12 కోట్ల రూపాయలకు పైగా నగదు ప్రభుత్వం వెచ్చించనుంది. జీవన శైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించటం, జాతీయ-అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్పూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు జరగనున్నాయి.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ కు సీఎం చేరుకోనున్నారు. శాప్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం జగన్ ఉపన్యాసం ఉంటుంది. ఆపై క్రీడా జ్యోతిని వెలిగించి ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆపై క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ అవుతారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు.