Bandaru Port : కృష్ణా జిల్లా వాసుల దశాబ్దల కల నెరవేరనుంది. సుదీర్ఘ కాలం తర్వాత బందరు పోర్టు శంకుస్థాపనకు నోచుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బందరు పోర్టుకు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బందరుకు హెలికాప్టర్ లో బయలుదేరతారు. తాపసిపుడి హెలిపాడ్ దగ్గర దిగి.. 9 గంటల 10 నిమిషాలకు పోర్ట్ దగ్గర భూమి పూజలో జగన్ పాల్గొంటారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి మచిలీపట్నం టౌన్‌లోని భారత్ స్కౌట్స్ గ్రౌండ్‌కు చేరుకుని ఫోటో గ్యాలరీని వీక్షిస్తారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..
బందరు పోర్టును సుమారుగా 11,454 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తొలి దశలో 5,156 కోట్టు పెట్టుబడి పెట్టనున్నారు. దీని సామర్థ్యం 116 మిలియన్ టన్నులు. మొత్తం 16 బెర్తులతో నిర్మించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు, 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి 3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం కలుగుతుంది. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. ఈ పోర్టు క్లింకర్, గ్రానైట్ బ్లాక్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
వాస్తవంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం పోర్టు పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పోర్టు కోసం ల్యాండ్ బ్యాంక్ సేకరణ వంటి హడావిడి జరిగింది. 2019లో ఎన్నికలకు నెలన్నర ముందు చంద్రబాబు పోర్టు నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టారు. అయినా పనులు ఒక అడుగు ముందుకు పడలేదు. తర్వాత జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కోవిడ్ కారణంగా రెండేళ్లు జాప్యం జరిగింది. ఈలోపు పర్యావరణ అనుమతుల గడువు ముగియటం వంటి పలు అంశాలతో ఇంకా ఆలస్యం అవుతూ వచ్చాయి. మొత్తం మీద ఇవాళ పోర్టు శంకుస్థాపన జరుగుతుంది.