NTV Telugu Site icon

AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..

Cm Jagan

Cm Jagan

AP CM Jagan: వరుసగా ఐదో సారి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు. ప్రతీ రైతుకు ఇప్పటివరకు రూ.54 వేలు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు. ఐదేళ్లలో ప్రతీ రైతు ఖాతాలో రూ.61,500 జమ చేశామని, రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడొద్దన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని సీఎం స్పష్టం చేశారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కరువే కరువు ఉందన్నారు. గ్రామాలకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులతో పాటు.. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వేతో వివాదాలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.. రైతులకు పగటిపూట 9గంటల కరెంట్‌ ఇస్తున్నామన్న సీఎం.. కరువు సీమగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోందన్నారు. అమూల్ వచ్చిన తర్వాత పాల ధరలు నాలుగు సార్లు పెరిగాయన్న సీఎం.. అమూల్‌ రాకముందు హెరిటేజ్ సంస్థ రైతులను దోచుకుందని ఆరోపించారు. రైతుకు శత్రువు చంద్రబాబేనని.. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంపేసి, మళ్లీ ఆయన్నే కీర్తించారని విమర్శలు గుప్పించారు. ఆ మహానాడు డ్రామాకు ముందు ఒక ప్రకటన చేశారన్న ముఖ్యమంత్రి.. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడని.. సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడని.. చంద్రబాబు సత్యాన్ని పలకరు, ధర్మానికి కట్టుబడరని.. చంద్రబాబుకు విలువలు లేవు, విశ్వసనీయత లేదంటూ సీఎం జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also: Head Constable: గ్రామస్థులపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం.. కారుతో ఈడ్చుకెళ్లి..

అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడని.. చంద్రబాబుకు ఒరిజినాల్టీ లేదు, పర్సనాల్టీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంతకన్నా లేదు.. పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరు.. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతారు, ఏ గడ్డైనా తింటారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు కానీ మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబులిటీ ఉంటుంది.. కానీ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారని ఆరోపణలు చేశారు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు.. చంద్రబాబు, గజదొంగల ముఠాది అధికారం కోసం ఆరాటమేనని ఆయన మండిపడ్డారు. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికి వారి పోరాటమని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఓ యుద్ధం జరగబోతోందని ముఖ్యమంత్రి చెప్పారు. వాళ్లు చెబుతున్న అబద్ధాలు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మళ్లీ ఆశీర్వదించాలంటూ అభ్యర్థించారు. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడే కర్నూలు జిల్లా గుర్తొస్తుందని సీఎం జగన్‌ అన్నారు.

 

Show comments