నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం.. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారు.. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ చూడని విధంగా రైత భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుకు 13, 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నాం.. ప్రతి మహిళ ముఖంలోనూ ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది.. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నాం అని సీఎం జగన్ వెల్లడించారు.
ఇక, నా కంటే ముందు చాలా మంది సీఎంలు పని చేశారు.. నా కంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారు అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నేను వయస్సులో చాలా చిన్నోడిని.. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం వేస్తున్నామన్నారు. మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు. మార్పు కొనసాగడం అవసరం అన్నారు. ఇంటికీ వెళ్ళాక ఆలోచించండి.. భార్య, పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు. వ్యవస్థలో సామర్థ్యం పెంచేందుకు నాకు సలహాలు ఇవ్వండి.. చేయూత లాంటి బటన్లు నొక్కాను.. 10 రోజులు అటు ఇటుగా డబ్బులు పడతాయి.. ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి బట్టన్ నొక్కాను.. మీరు సాలహాలు ఇస్తే వినడానికి సిద్ధంగా ఉన్నాను అని సీఎం జగన్ తెలిపారు.