CM YS Jagan : సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను అని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించామని తెలిపారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్య కార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని.. ఇప్పటి వరకు మత్స్యకార సోదరుల కు 538 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు.. వైసీపీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.. మీకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసకుంటుందని తెలిపారు సీఎం వైఎస్ జగన్..
చేపల వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వాలు మత్స్యకార కుటుంబాలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు సీఎం జగన్.. ముష్టి వేసినట్లు నాలుగు వేలు ఇచ్చేవారు.. గత ప్రభుత్వం ఐదేళ్ల లో 104 కోట్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే 125 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.. ఇక, డీజిల్ సబ్సిడీ స్పాట్ లో వచ్చేలా చర్యలు తీసుకున్నాం.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం అన్నారు.. మత్స్యకార కుటుంబాలలో ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు నష్ట పరిహారం అందిస్తున్నాం అని పేర్కొన్నారు. దేశంలోనే రెండవ అతి పెద్ద సముద్ర తీరం ఉన్న మత్స్యకార కుటుంబాల జీవనం అంతంత మాత్రమే.. మత్స్యకారుల అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్ల రూపాయలతో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని తెలిపారు.
చంద్రబాబు లా నేను మోసం చేయను.. ఎన్నికలకు ముందు ఆక్వా రైతులకు విద్యుత్ పై సబ్సిడీ ఇస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశాడు అని మండిపడ్డారు జగన్.. మత్స్యకారులు జీవన ప్రమాణాలు పెంచడం కోసం పశ్చిమ గోదావరిలో ఫిషరీస్ యునివర్సటీ నెలకొల్పుతున్నాం.. 185 కోట్లతో దిండి వద్ద ఆక్వా పార్క్ నిర్మాణం చేస్తున్నాం.. రూ.417 కోట్లతో ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం అని వెల్లడించారు.. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేయాలన్న తపనతో పని చేస్తున్నా.. ప్రతి అనగారిన కుటుంబాన్ని సామాజిక వర్గాన్ని నా కుటుంబం అనుకుంటున్నా.. కానీ, పేదలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టు కోలేక పోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.. గత పాలనలో ఎస్సీలకు, మత్స్యకారులకు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఆరోపించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.