NTV Telugu Site icon

CM Chandrababu: పోలవరం అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.. ప్రాజెక్టును గందరగోళంగా చేశారు..

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు.

తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం, అప్పట్లోనే అవకతవకలు జరగడం, కాంట్రాక్టర్ రద్దుతో ప్రాజెక్టు అటకెక్కిందని చంద్రబాబు అన్నారు. నానా అవస్థలు పడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు, రాయలసీమ వరకు తాగునీరు అందుతుందన్నారు. చైనాలో ఉన్న త్రీ గార్జస్ ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం అంటూ చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి 2019 వరకు 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. 31వ సారి ప్రాజెక్టును చూడడానికి వచ్చానని.. తన కష్టాన్ని బూడిదపాలు చేశారని మండిపడ్డారు. రాజకీయాలకు ఉండకూడని వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా మారారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని.. ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారని సీఎం చంద్రబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదన్నారు.

ఈ ప్రాజెక్టుపై వంద సార్లు సమీక్షలు నిర్వహించామని.. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందని.. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదన్నారు. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.