NTV Telugu Site icon

YSR Kalyanamastu: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan Released YSR Kalyanamastu and Shaadi tofa Funds: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిధులను విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి- మార్చి త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు తమ ఖాతాలో జమ కానున్నాయి. రూ. 87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివాహాలు చేసుకున్న పేదలకు అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా, ఇలా చేయడంలో పదోతరగతి కచ్చితంగా చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చామన్నారు.

అప్పుడే కళ్యాణమస్తు, షాదీ తోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామన్నారు. దీని వల్ల పదో తరగతి వరకూ చదివించాలన్న తపన ప్రతి పేద కుటుంబంలో మొదలవుతుందన్నారు. ఆడపిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. పదోతరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందని.. ఆ తర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందన్నారు. అందువల్ల నేరుగా ఇంటర్మీడియట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఎలాగూ మనం అమ్మ ఒడి ఇస్తున్నామని.. ఇంటర్మీడియట్‌ అయ్యాక.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తింపచేస్తున్నామన్నారు. జగనన్న వసతి దీవెన కూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నామని.. ఏడాదికి రూ.90వేల వరకూ ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాయన్నారు. జగనన్న అమ్మ ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుందన్నారు. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందని సీఎం తెలిపారు. పేదరికం పోవాలంటే ఒకే ఒక్క మార్గం చదువులు మాత్రమేనని.. చదువులు ఉంటేనే.. మెరుగైన ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయన్నారు.

Read Also: Nuzvid IIIT: విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్!

ఇంతకు ముందు ప్రభుత్వం ఎన్నికల కోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసిందని ఆయన విమర్శించారు. 17,709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టిందని ఆరోపించారు. దాదాపు రూ.70 కోట్లు ఎగర గొట్టిందన్నారు. ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారని విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదన్నారు. మనం ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. ఎస్టీలకు గతంలో రూ. 50వేల రూపాయలు ఇస్తామని చెప్పారని, కానీ డబ్బు కూడా ఇవ్వలేదన్నారు. మనం వీరికి రూ.లక్ష రూపాయలకు పెంచామన్నారు. “బీసీలకు గతంలో రూ.35వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనం వీరికి రూ.50వేలకు పెంచాం. అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచాం. ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచాం. ” అని సీఎం పేర్కొన్నారు.