PM Narendra Modi Greets Chess Olympiad 2024 Winners: చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన భారత చెస్ క్రీడాకారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. భారత చెస్‌లో చరిత్ర సృష్టించడం ప్రశంసనీయమని కొనియాడారు. దేశం గర్వపడేలా చేసిన ప్లేయర్స్‌లో మన తెలుగు ఛాంపియన్లు ఉండటం మరింత గర్వకారణం అని చంద్రబాబు పేర్కొన్నారు. 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, అమ్మాయిల టీమ్స్ స్వర్ణ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.
‘భారత చెస్ చరిత్రలో ఈరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఛాంపియన్‌లు మనమందరం గర్వపడేలా చేశారు. విజేతలకు నా ప్రత్యేక అభినందనలు. జట్టులో మన తెలుగు ఛాంపియన్లు ఉండటం మరింత గర్వకారణం. ద్రోణవల్లి హారిక, పెండ్యాల హరికృష్ణలు భారత జెండాను రెపరెపలాడించారు. వారికి ప్రత్యేక అభినందనలు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Also Read: Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించడంపై స్పందించారు. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ పతకాలు గెలవడంతో సంతోషం వ్యక్తం చేశారు. ‘భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించారు. భవిష్యత్తు తరాలకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిచ్చేలా ఉంది. చెస్‌ను మరింత మంది కెరీర్‌గా మలుచుకొనేందుకు మార్గం చూపించారు. విజేతగా నిలిచిన ప్రతీఒక్కరికీ నా శుభాకాంక్షలు’ అని ప్రధాని పేర్కొన్నారు.