NTV Telugu Site icon

AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు

Rushikonda Palace

Rushikonda Palace

AP CM Chandrababu: రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించుకోవడం చేయలేదన్నారు. రుషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు.

Read Also: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

నిర్మాణ వ్యయం బిల్లులు అన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. టబ్ కోసం 36లక్షలు, కమోడ్ కోసం 12లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. 9.88ఎకరాల్లో ఏడు బ్లాకుల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించారని చెప్పారు. 13వేల 543చదరపు మీటర్ల నిర్మాణం జరిగిందన్నారు. అదిరిపోయే బిల్డింగ్‌లు నిర్మించి కొండను తొలిచేసి కొండ చరియలు విరిగిపడకుండా జపాన్ టెక్నాలజీ వాడారని వెల్లడించారు. వైట్ హౌస్, రాష్ట్ర పతి భవన్‌లో కూడా లేని కారిడార్లు నిర్మించారని చెప్పారు. చాలా దేశాలు తిరిగాను కానీ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎలా వచ్చిందా…అని ఆశ్చర్యం కలుగుతుందన్నారు. రుషికొండ మీద విచారణ చేస్తే చాలా మంది ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. జగన్ ఆంధ్రా ఎస్కో బార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం అంటే లెక్క లేకుండా వ్యవహరించారన్నారు. సర్వే రాళ్లపై బొమ్మ కోసం 700కోట్లు పైగా ఖర్చు చేశారన్నారు. భోగ విలాసాల కోసం ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు.

Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..

రుషికొండ నిర్మాణాలపై చర్చ జరగాలని.. ప్రజలు కూడా దీనిపై అభిప్రాయం చెప్పొచ్చన్నారు. ఋషికొండను ఏం చెయ్యాలో తనకు అర్థం కావడం లేదన్నారు. రుషికొండలో ప్రజా ధనం దుర్వినియోగంపై వైసీపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. విశాఖ రాజధాని పేరుతో మభ్య పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఒక రాజకీయ నాయకుడు తప్పుడు పనులు చేసి ఎదురు దాడికి పాల్పడటానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజా కోర్టులో రుషికొండలో జరిగిన నేరంపై చర్చ జరగాలన్నారు. ఇక్కడ విలాసవంతమైన భవనాలు చూసి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. పర్యాటక శాఖకు కూడా రుషికొండ కాస్ట్లీ ఎఫైర్ అయ్యిందన్నారు. రుషికొండ కోసం ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించిందన్నారు. రుషికొండ చర్చ అవసరం లేదు శిక్ష మిగిలింది.. అందులో ప్రభుత్వం వెయ్యాలిసింది.. ప్రజలు వెయ్యాలసినది మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రజా చైతన్యం కోసం పోలవరం చూపించాం.. ప్రజాస్వామ్యంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో చూడాలంటే రుషికొండ రావాలన్నారు. రుషికొండ నిర్మాణ, నిర్వహణ వ్యయం భారీగా ఉందన్నారు. తాను ఓపెన్‌ మైండ్‌తో ఉన్నానన్నారు. రుషికొండ దగ్గర పరిశీలన కోసం వచ్చిన వాళ్ళ పై పెట్టిన కేసులు ఎత్తివేస్తామన్నారు.

 

Show comments