రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఈడీబీ అధికారులు ఉన్నారు.
ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేయనున్నారు. సోమవారం జ్యూరిచ్‌లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్‌లో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పొరా’ పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం చర్చిస్తారు. అనంతరం దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రాత్రి ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
రెండో రోజు సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ, సోలార్ ఇంపల్స్, వెల్‌స్పన్, కోకకోలా, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్ తదితర సంస్థల ఛైర్మన్లు సహా సీఈఓలతో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ సమావేశానికి యూఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ కూడా హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ చర్చల్లో సీఎం పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చాగోష్ఠులు, బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చే ఇంటర్వ్యూలో రాష్ట్ర విధానాలను ఆయన వివరిస్తారు.
దావోస్ సదస్సులో భాగంగా మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. నాలుగో రోజు ఉదయం సీఎం జ్యూరిచ్ చేరుకుని.. అక్కడి నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఏపీ రాష్ట్రాన్ని మళ్లీ అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని సీఎం దావోస్‌కు వెళ్లేముందు ఎక్స్‌లో పేర్కొన్నారు.