నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్చాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని.. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అనంతరం కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రొద్దుటూరు రోడ్డులోని మున్సిపల్ కార్మికుల ఇంటి వద్దకు చేరుకుని.. ఇంటింటి చెత్త సేకరణ, తడి, పొడి, ఇతర వ్యర్ధాల నిర్వహణపై వివరాలు తెలుసుకుంటారు. రాయల కూడలి నుంచి సభావేదిక వరకు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర నినాదంతో ర్యాలీలో పాల్గొంటారు. ఉన్నత పాఠశాల సభా ప్రాంగణంలో పురపాలకలోని వార్డు ప్రజలతో పాటు స్థానిక ప్రతినిధులతో కలిసి స్వచ్ఛాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంబించి ప్రజలతో చర్చిస్తారు.
సీఎం చంద్రబాబు సాయంత్రం 4:30 నిమిషాలకు హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకుని 4:40 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 4: 50 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరి 5:35లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాసగృహానికి 6 గంటల 15 నిమిషాలకు సీఎం చేరుకుంటారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.