NTV Telugu Site icon

AP CM Chandrababu: ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని ఆయన విమర్శించారు. ఆయన పరదాలు కట్టుకుని పైన వస్తుంటే కింద చెట్లు కూడా కొట్టేవారని అన్నారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడొచ్చని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.

Read Also: YS Jagan: శ్రీవారి లడ్డూ వివాదంపై వైఎస్ జగన్‌ రియాక్షన్

ఈ వంద రోజులు పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చానన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం 4 వేల పెన్షన్ ఇస్తోందన్నారు. ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రతీ ఒక్క ఇంటికి లాభం కలగాలని ఆలోచన చేశామన్నారు. మొదటిగా పెన్షన్ పెట్టింది ఎన్టీఆర్ అని.. తాము మొదటిసారి సీఎం అయిన తర్వాత 75 రూపాయలకు పెంచామన్నారు. ఇప్పుడు అది నాలుగు వేలకు తానే పెంచానని స్పష్టం చేశారు. ఇంకా ఎక్కువ ఇద్దామన్నా డబ్బు లేదన్నారు. సంపద సృష్టిస్తే తప్ప ఏదీ సాధ్యం కాదన్నారు. ఉద్యోగులకు సెలవులు వచ్చినా జీతాలు ఇచ్చామని సీఎం చెప్పారు. ప్రతీ నెలకు ఒకసారి అధికారులు మీ ఇళ్లకు వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. తాను వెళ్లి పరిశీలించిన ఇళ్ల వద్ద వారి సమస్యలు తెలుసుకున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లుగా గత ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డ పఠాన్ కాజావళి కుటుంబానికి ఆదుకుంటామన్నారు.

పరిస్థితుల ప్రభావం వల్ల చాలా మంది పిల్లలు చదివించలేక చాల మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకునే పని చేస్తుందన్నారు. ఏపీ ఇచ్చే పెన్షన్ అన్నీ ధనిక రాష్ట్రాల కన్నా ఎక్కువ అని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ చాలామంది అనర్హులకు ఇచ్చిందని, వికలాంగులు కాని వారికి కూడా ఆ కోటాలో ఇచ్చారని విమర్శించారు. వచ్చే అక్టోబర్‌లో అందరి పరిస్థితిని కనుక్కుని వారికి అవసరమైన పెన్షన్ ఇస్తామన్నారు. డాక్టర్లు వికలాంగులు కానీ వారికి సర్టిఫికెట్లు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.