ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గన్నవరం నుంచి ఉదయం 9.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరుకు రానున్నారు. ఉదయం 11.30 సాలూరు డిగ్రీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం సాలూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మక్కువ మండలం బాగుజోల చేరుకుంటారు. బాగుజోలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ సందర్శిస్తారు.
ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన అనంతరం బాగుజోల వద్ద రోడ్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ గిరిజనులతో పవన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి గన్నవరం వెళ్తారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పవన్ రాక నేపథ్యంలో జనసేన నేతలు కూడా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు.