AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!

  • రేపు ఏపీ కేబినెట్ సమావేశం..
  • ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌చివాల‌యంలో భేటీ..
  • సీఆర్డీఏ కీల‌క అంశాల‌కు అమోదం తెల‌ప‌నున్న కేబినెట్..
Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది.. గురువారం రోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం మొతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు రూ.122 కోట్ల చెల్లింపుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది.

ఇక, హ్యాపీ నెస్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రేరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అదేవిధంగా అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5జీ సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలవడంకు ఆమోదం లభించే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో రోప్‌వే ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వనున్న కేబినెట్, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా రూ.1,205 కోట్లతో 18 అంతస్తుల రెండు టవర్ల నిర్మాణ పనులను ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది.

అలాగే కృష్ణా నదిపై విజయవాడ–అమరావతి మధ్య భవిష్యత్తులో అవసరమయ్యే వంతెనల సంఖ్యపై అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్ నియామకం, ప్రభుత్వ భవనాల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.