Purandeswari: ఏపీలో పవన్ కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అని ఆమె చెప్పారు.జనసేనతో బంధుత్వం లేదు అని అధిష్టానం చెపితే లేనట్టేనని.. పవన్‌తో బంధుత్వంపై అధిష్టానం చెపితే మీకూ చెపుతామని మీడియా ముందు పురంధేశ్వరి తెలిపారు. పార్టీ సంస్ధాగత బలోపేతానికి తాము కృషి చేస్తున్నామన్నారు. తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్న పురంధేశ్వరి.. ప్రధాని చెప్పినట్టు ఎంపీ స్ధానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అభ్యర్దులకు న్యాయ సలహా, సహకారాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా జిల్లా లీగల్ సెల్ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.
Read Also: Kishan Reddy: గ్యారంటీల పేరుతో గారడీ చేస్తున్నారు.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. పొత్తులు ఎలా ఉన్నా సంస్ధాగతంగా బలోపేతం కావడంపై బీజేపీ దృష్టి పెడుతుందని ఆమె వెల్లడించారు. సర్పంచుల కోసం మేం చేసిన ఆందోళనలో వైసీపీ సర్పంచులు, జనసేన నాయకులు పాల్గొన్నారని చెప్పారు. కేంద్రం గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చే నిధులు పక్కదోవ పడుతున్నాయని గిరిరాజ్ సింగ్ కమిటీ తేల్చిందన్నారు. సెక్రటేరియట్‌లు కూడా కేంద్రం గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చే నిధులతో నిర్మిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుందని.. సర్పంచుల పక్షాన బీజేపీ అండగా నిలబడి ఉంటుందన్నారు.