Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ ప్రారంభం కానుంది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్యులు సమావేశం కానున్నారు.. అయితే, ఈ కీలక భేటీకి 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం అందింది.. ముఖ్యంగా త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పొత్తులపై ఓ నిర్ణయానికి రానున్నారట రాష్ట్ర నేతలు.. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉందని చెబుతూ వస్తున్న నేతలు.. జనసేన-టీడీపీ జట్టు కట్టడంతో.. అసలు టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై ఓ నిర్ణయానికి రానుందట.. అయితే, ఈ భేటీలో రాష్ట్ర నేతలను అభిప్రాయాలు తరుణ్ చుగ్ తీసుకోనున్నారట.. ఇప్పటికే జరిగిన పదాధికారుల సమావేశంలో నేతల అభిప్రాయాలను, వివరాలను తరుణ్ చుగ్ కు వివరించనున్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. ఈ రోజు జరిగే సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొననుండడంతో.. నేరుగా ఆయనే తమ అభిప్రాయాలను చెప్పనున్నారు నేతలు.. ఇక, పొత్తులపై ఏపీ నేతల అభిప్రాయాలపై బీజేపీ హైకమాండ్‌కు ఓ నివేదిక సమర్పించనున్నారు తరుణ్ చుగ్. ఆ తర్వాత ఏపీలో పొత్తులపై ఓ నిర్ణయానికి రానుంది బీజేపీ అధిష్టానం.
Read Also: YS Sharmila: నేడు కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల
కాగా, ఏపీలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగింది.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సైతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించడం.. ఆయన పాల్గొనడం జరిగిపోయాయి.. అయితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళ్తే బాగుంటుందనే అభిప్రాయంతో పవన్ కల్యాణ్ ఉన్నట్టు పలు సందర్భాల్లో స్పష్టంగా ఆయన వ్యాఖ్యలు చెప్పాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తామని చెబుతూ వచ్చారు పవన్.. ఇక, ఇదే సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో.. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలులో పరామర్శించిన పవన్ కల్యాణ్.. అక్కడే పొత్తులపై ప్రకటన చేశారు. ప్రస్తుతం.. తాము బీజేపీతో పొత్తులో ఉన్నాం.. టీడీపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాం.. అయితే, తమతో కలిసి వస్తారా? లేదా? అనేది బీజేపీయే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో.. అసలు టీడీపీ-జనసేన కూటమితో కలిసి వెళ్లాలా? లేదా? అనే ఆలోచనలో పడిపోయింది బీజేపీ.. ఈ రోజు భేటీలో దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి పంపనుంది.