NTV Telugu Site icon

Somu Veerraju: కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్ పూరిని కలిసిన సోము వీర్రాజు.. ఏపీ సర్కారుపై ఫిర్యాదు

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: కేంద్ర నగర వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో కలిశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి నివాసంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న పొరపాట్లు, అలసత్వంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి వినతి పత్రం అందించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించాలని కేంద్రమంత్రిని కోరగా.. వస్తామని హామీ ఇచ్చినట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ ఇళ్లను కేటాయించారని.. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి కేటాయిస్తే పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర మంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వ్యక్తిగతంగా పరిశీలన చేయాలని కోరామని ఈ సందర్భంగా సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర సహకారంతో నిర్మాణం జరుగుతున్న ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే బోర్డు లేదని.. వైసీపీ కలర్లు వేస్తున్నారని, వైసీపీ ఇళ్లుగా మార్చేశారని ఆయన ఆరోపించారు. గైడ్‌లైన్స్‌లో లేని విషయాలను అభ్యంతరకరంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: Kishan Reddy : కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ

జగనన్న కాలనీని మోడీ అన్న ఇల్లు అని పేరు పెట్టాలన్నారు. వైసీపీ కలర్ వాడొద్దని ఆయన సూచించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు సైతం ఇప్పటికీ ప్రజలకు ఇవ్వలేదన్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని సోము వీర్రాజు తెలిపారు. మంత్రి పోలవరంపై గతంలో సమీక్ష చేశారని.. ప్రస్తుత పరిస్థితి ఏంటని, వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. పంచాయతీ శాఖా మంత్రిని కూడా కలుస్తామన్నారు. పంచాయతీ సర్పంచుల నిధుల విషయంలో ఏపీలో గందరగోళం నెలకొందన్నారు. సర్పంచులకు నిధులు నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచుల ఖాతాల్లో పడ్డ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలోకి మళ్ళిస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్టం చాలా నిధులు అడుగుతోందని.. వాస్తవాలు తెలుసుకోవాలని ఏపీ బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు.