NTV Telugu Site icon

Purandeswari: పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే?

Purandeshwari

Purandeshwari

Purandeswari: టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు. మూడు పార్టీలు పోటీ చేయడంపై పవన్‌ తన అభిప్రాయం చెప్పారని.. తమ పార్టీ నిర్ణయాన్ని అధిష్ఠానం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి వివరిస్తానని, తమ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో కొనసాగుతుందని పవన్‌ కళ్యాణ్ చెప్పిన మాటలను పురంధేశ్వరి గుర్తు చేశారు. తాము కూడా తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతామని ఆమె చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రం ఉందనడం అవాస్తవమని పురంధేశ్వరి వెల్లడించారు.

Also Read: YSRCP: రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. వైసీపీ వ్యూహాలు ఏంటి?

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అనంతరం టీడీపీతో పొత్తుకుంటానని ప్రకటించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించనున్నట్లు పవన్‌ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తును ప్రకటించడానికి గల కారణాన్ని ఆయన వారికి చెప్పనున్నారు. తమ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అని, ఎన్డీఎలో తాము కొనసాగుతామని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ శనివారంనాడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించడానికి తాను బీజేపీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Show comments