NTV Telugu Site icon

Purandeswari: విధానాలు ఎత్తిచూపిస్తే కోవర్ట్‌ అంటే ఎలా..? 175 స్థానాల్లో పోటీ..

Purandeswari

Purandeswari

Purandeswari: విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అంటే ఎలా..? అంటూ మండిపడ్డారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే… ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. కరువు జిల్లాలైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చెరువులకు నీరు ఇస్తామని చెప్పి అందించలేకపోయారని దుయ్యబట్టారు.. అభివృద్ధికి బీజేపీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. కేంద్ర నిధులతో స్టిక్కర్లు వేసుకుని వైసీపీ పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Read Also: Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పరిపాలన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..? అంటూ మండిపడ్డారు. విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటే ఎలా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నాం… రాష్ట్రంలోని 175 స్థానాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని హెచ్చరించారు. అవినీతి మరక లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి. కాగా, ఏపీలో ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు ఇవిగో అంటూ పురంధేశ్వరి కామెంట్లు చేస్తూ.. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. పురంధేశ్వరి టీడీపీ కోవర్ట్‌గా పనిచేస్తున్నారంటూ అధికార వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే.. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.