NTV Telugu Site icon

Virat Kohli: ఉన్నపలంగా ముంబై వెళ్లిన విరాట్‌ కోహ్లీ.. అసలు కారణం అదేనా?

Kohli Anushka

Kohli Anushka

Virat Kohli Back to Mumbai to Meet Anushka Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా గువాహటిలో భారత్ ఆడాల్సిన మొదటి వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం ప్లేయర్స్ తిరువనంతపురం చేరుకున్నారు. అయితే స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి తిరువనంతపురం వెళ్లలేదని తెలుస్తోంది. అతడు ఉన్నపలంగా ముంబై వెళ్లినట్లు పలు స్పోర్ట్స్‌, జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇందుకు కారణం కోహ్లీ సతీమణి అనుష్క శర్మ అని తెలుస్తోంది.

గువాహటిలో తొలి వార్మప్‌ మ్యాచ్‌ అనంతరం భారత ఆటగాళ్లంతా ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరారు. విరాట్ కోహ్లీ జట్టు యాజమాన్యం అనుమతితో ముంబైకి వెళ్లిపోయినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ ముంబైకి వెళ్లినట్లు ఓ బీసీసీఐ అధికారి ధ్రువీకరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోమవారం నాటికి కోహ్లీ తిరిగి జట్టుతో చేరతాడని వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం తిరువనంతపురంలో భారత్ రెండో వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

Also Read: iPhone 14 on Flipkart: ఫ్లిప్‌కార్ట్ కిర్రాక్ ఆఫర్.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌పై రూ. 20 వేల కంటే ఎక్కువ తగ్గింపు!

విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కోహ్లీ ఉన్నపలంగా ముంబై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కోహ్లీ-అనుష్క జంట ముంబైలోని ఓ గైనకాలజీ ఆసపత్రి వద్ద కన్పించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. సతీమణి అనుష్కను కలిసేందుకే కోహ్లీ గువాహటి నుంచి నేరుగా ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జంట త్వరలోనే తమ రెండో సంతానానికి జన్మనివ్వబోతోందని సమాచారం. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్‌ కోహ్లీ 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు. ఈ జంటకు 2021 జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది.