AAM Admi Party: ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం బీహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను మరింత తగ్గించనుంది. ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ దేశ రాజధానిలో బీహార్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బీహార్‌లో పార్టీని బలోపేతం చేయాలని సందీప్ పాఠక్ ఉద్ఘాటించారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే, బీహార్ ఇన్‌ఛార్జ్ అజేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
“మురికి రాజకీయాల కారణంగా రాష్ట్రం ముందుకు సాగకపోవటం బీహార్ దురదృష్టం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ బలంగా ఉండటం తప్పనిసరి.” అని ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ చెప్పారు. పార్టీని విస్తరించేందుకు ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయాలని బీహార్‌లోని పార్టీ నాయకులను పాఠక్ కోరారు. ‘‘బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తాం. కానీ ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. బీహార్‌లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేం, అందుకు ముందుగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సొంతంగా కమిటీ వేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి ఇప్పటినుంచే కష్టపడండి. ఒకసారి పార్టీ బలంగా మారితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాము, ”అని సందీప్ పాఠక్ జోడించారు.
Read Also: B20 Summit: భారతదేశంలో డిజిటల్ విప్లవం రాబోతోంది.. బీ20 సమ్మిట్‌లో ప్రధాని
ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన పార్టీ అవసరమని ఉద్ఘాటించిన పాఠక్.. గుజరాత్‌లో మాదిరిగానే బీహార్‌లో కూడా ఆప్ పూర్తి శక్తితో ఎన్నికల్లో పోరాడుతుందని చెప్పారు. తన ప్రణాళికల గురించి పాఠక్ మాట్లాడుతూ, పార్టీ మొదట స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, గత తొమ్మిదేళ్లలో ప్రసంగాలు తప్ప ప్రధాని మోదీకి సమాధానాలు లేవని అన్నారు. ఇండియా కూటమి గురించి అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చని, దేశమే తమకు ముఖ్యమన్నారు. ఆప్ జాతీయ పార్టీ అని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ఆయన.. పొత్తులపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆప్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ స్పందించారు. ఆప్‌ను బీహార్‌కు ఆహ్వానించిన వారికి ఈ చర్య ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. “బీహార్‌లో 40 సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు ఎన్డీయే గెలుస్తుంది. బీహార్‌లో AAP లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వారిని బీహార్‌కు ఆహ్వానించిన వారికి ఇది సమస్యాత్మకం.” అని షానవాజ్ హుస్సేన్ అన్నారు.