Earthquake: ఉత్తర భారతాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఆ భూకంపం సంభవించిన కొద్ది సమయంలో మరోసారి భూప్రకంపనలు భయపెట్టాయి. ఉత్తరాఖండ్‌లో 4.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణానికి ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్‌లో రెండో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Shooting at Shopping Mall: బ్యాంకాక్ మాల్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి
నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూప్రకంపనల దాటికి.. సౌత్ ఢిల్లీలోని ఓ కాలేజీకి చెందిన తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ పగిలిపోయింది. ఇదిలా ఉంటే.. ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, బరేలీలో కూడా భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొద్ది సమయంలోనే మరోసారి ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు సంభవించాయి.
అంతకుముందు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించవచ్చని నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అనే శాస్త్రవేత్త సోమవారం జోస్యం చెప్పారు. ఇంతలోనే భారత్‌లో ప్రకంపనలు రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టర్కీ, సిరియాలో వినాశకరమైన భూకంపాలను ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అంచనా వేశారు.