రేపు (సోమవారం) అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సుమారు 41 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. గత ఐదు రోజులుగా విజయవాడలో అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. నగరంలోకి వచ్చే వారిపై పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుంటున్నారు బెజవాడ పోలీసులు. అంగన్వాడీల ఛలో విజయవాడ నేపథ్యంలో నగరంలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. ధర్నా చౌక్ లో ఉన్న అంగన్ వాడీ వర్కర్ల టెంట్ దగ్గర పోలీసులు మోహరించారు. టెంట్ నుంచి ఎవరు బయటకి వచ్చినా అరెస్ట్ కు సిద్దంగా ఉన్నారు పోలీసులు. మరోవైపు.. రాజమమండ్రిలో విజయవాడకు వెళ్తున్న 29 మంది అంగన్వాడీలను రైల్వేస్టేషన్, బస్టాండ్లలో గుర్తించి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు. అటు.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రైల్వే స్టేషన్ లో విజయవాడ తరలి వెళుతున్న 30 మంది అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు అమరావతిలో అంగన్వాడి సంఘం పిలుపుమేరకు ముఖ్యమంత్రి నివాస ముట్టడి, ఆందోళనలో పాల్గొనేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా.. పోలీసుల తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు.
Read Also: Gujarat: శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్‌లో ఘటన..
ప.గో జిల్లా పాలకొల్లులో బయలుదేరిన అంగన్వాడీలను రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు నిరాకరించి రైల్వే స్టేషన్ లోనే బైటాయించారు. కాకినాడలో నాయకులను టు టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చిన పోలీసులు.. ఛలో విజయవాడకు అనుమతులు లేవని ముందస్తు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా.. కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసిన టెంట్ సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. రైళ్లు, బస్సులు ద్వారా విజయవాడ వెళ్లే అవకాశం ఉండడంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ లు దగ్గర పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇదిలా ఉంటే.. రేపు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడికి పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు ఎవ్వరికీ విజయవాడ పోలీస్ వారి యొక్క అనుమతులు లేవు అని ఏలూరు జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడకి వెళ్ళవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఎవ్వరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందు “మోడీ,మోడీ” నినాదాలు.. “ఫ్లయింగ్ కిస్”తో సమాధానం..