Andhrapradesh: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 656 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. కేరళ, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కొత్త కరోనా వేరియంట్ కట్టడికి వైద్యులు చర్యలు చేపడుతున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జీజీహెచ్‌లో వెంటిలేటర్స్‌తో కూడి 30 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ప్రత్యేకంగా కరోనా క్వారంటైన్ వార్డును ఏర్పాటు చేశారు.
Read Also: Prudhviraj on AP Politics: ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో యుద్ధ ప్రాతిపదికన కరోనా సహాయక సన్నాహాలు ప్రారంభించారు. జేఎన్-1 కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో కేసులు నమోదు కాకపోయినా అనధికారికంగా కొన్ని కరోనా కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎవరికి వారు హోం ఐసోలేషన్, సొంత వైద్యంతోనే కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు డాక్టర్లు గుర్తించారు. కరోనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ హాస్పిటల్లో 1500 ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నాయి. జీజీహెచ్‌లో ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోల్చుకుంటే జేఎన్-1 ప్రభావం తక్కువగానే ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అశ్రద్ధ చేయొద్దని, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.