NTV Telugu Site icon

AP High Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..!

Babu

Babu

AP High Court: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.. ఆయన తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఓవైపు సీఐడీ తరపు లాయర్లు, మరోవైపు చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు హైకోర్టులో సుదీర్ఘంగా సాగాయి.. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్‌ చేశారు. దీంతో.. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది.

సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ, పొన్నవోలు వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌సాల్వే, సిద్ధార్థ్‌ లూత్రా వాదనలు కొనసాగించారు.. మధ్యాహ్నం 12 గంటలకు నుంచి 1.45 గంటల వకు చంద్రబాబు తఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు.. సీఐడీ తీరును తప్పుబట్టారు హరీష్‌ సాల్వే.. 2020లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో చంద్రబాబును ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు.. సీఐడీ గవర్నర్‌ అనుమతి కూడా తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ సాక్ష్యాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇదంతా చేసిందని హైకోర్టులో వాదనలు వినిపించారు సాల్వే.. ఇక, చంద్రబాబు తరఫున మరికొన్ని వాదనలు వినిపించారు సిద్ధార్థ్ లూథ్రా.. మరోవైపు.. భోజనం విరామం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు సీఐడీ తరఫున వాదనలు వినిపించారు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ..

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా వర్చువల్‌గా సీఐడీ తరపున వాదనలు వినిపించారు ముకుల్‌ రోహత్గీ.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌కు అనర్హుడు అని పేర్కొన్న ఆయన.. ఎఫ్‌ఐఆర్‌ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్‌ చేయలేదు.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ కొట్టివేయాలని హైకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్‌ రోహత్గీ. ఇక, సెక్షన్‌ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయవచ్చు.. ఎంతమంది సాక్షులను అయినా చేర్చొచ్చు అని సీఐడీ తరపు వాదనలు వినిపించారు లాయర్ ముకుల్‌ రోహత్గీ.. రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్న ఆయన.. షెల్‌ కంపెనీల జాడ తీస్తున్నాం.. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్‌ కాంట్రాక్ట్‌కు ఎలా వెళ్లింది? అని ప్రశ్నించారు. అన్ని బోగస్‌ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయని.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని వాదించారు. మరోవైపు.. ఈ డీల్‌కు కేబినెట్‌ ఆమోదం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్‌ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని హైకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్‌ రోహత్గీ. మొత్తంగా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది.. దీంతో.. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? అనే ఉత్కంఠ నెలకొంది.