CM Chandrababu: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారన్నారు.. ఎప్పుడూ తాను చేసే అరాచకాలు ఈసారి జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారని విమర్శించారు. అతని నైజం ప్రజలకు తెలిసిందేగా అన్నారు. వైఎస్ హయాం నుంచీ అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగలేదని చెప్పారు. నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్‌లు వేయగలిగారని.. రెండు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా జరిగింది కాబట్టే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని తెలిపారు.
READ MORE: TSRTC Record: రాఖీ పౌర్ణమికి రికార్డు ప్రయాణాలు.. టీఎస్ఆర్టిసీ చరిత్రలో ఇదే తొలిసారి!
అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 17శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. వర్షాల వల్ల పలువురు మృతి చెందటం బాధాకరమన్నారు. నష్ట నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. సంబంధిత మంత్రులు సమన్వయం చేసుకుంటున్నారన్నారు. ఈ ఆగస్టు 15తో సూపర్6 హామీలు దాదాపు పూర్తయినట్లే అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధం చేశామని చెప్పారు.
