Site icon NTV Telugu

Andhra Political Premier League 2024: ఛాన్స్ ఎవరికి? షాక్ ఎవరికి?

APPL 2024

D0bff0b9 7c26 4c79 B02f 0cbccb050f78

ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైందా?

2024లో జరగబోయే ఎన్నికలు ఎవరికి షాక్ ఇవ్వబోతున్నాయి?

ఒక్క ఛాన్స్ అడుగుతున్న జనసేనాని

రెండవసారి ఛాన్స్ అంటున్న సీఎం జగన్

చివరి ఛాన్స్ అంటున్న చంద్రబాబు 

మరి.. ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడు?

ఎవరికి వరాలు కురిపిస్తాడు? ఎవరికి షాకిస్తాడు?..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల అంశం చర్చనీయాంశం అవుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. నిజానికి ఇది ఖడ్గం సినిమాలో ఫ్యామస్ డైలాగ్. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. 2014లో అతి తక్కువ ఓట్ల శాతంతో అధికారాన్ని కోల్పోయిన వైఎస్‌ జగన్‌… ప్రతిపక్ష నేతగా అప్పట్లో అందుకున్న స్లోగన్‌ ఒక్క ఛాన్స్ ప్లీజ్.. నాటి టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి వెళ్లిన జగన్‌… ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. 3వేల 648 కిలోమీటర్ల దూరం నడిచి… రికార్డు సృష్టించారు. 2019లో ఆయన స్ట్రాటజీ వర్కవుట్ అయింది. ఇప్పుడు ఈస్లోగన్ అందుకున్నది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఇంకా ఎన్నికలకు 17 నెలల వరకూ గడువు వుంది. అయితే, అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. 175 సీట్లే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తున్నారు. గతంలో టీడీపీ గెలిచిన, వైసీపీ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన సీట్ల పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. టీడీపీ గెలవడానికి అవకాశం లేకుండా వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు ఓటేసి గెలిపించకుంటే.. ఇవే తనకు చివరి ఎన్నికలని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ప్రజల దగ్గరకెళ్లి ఏం చెప్పుకోవాలో.. ఎలా మాట్లాడాలో.. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ రాష్ట్రానికి ఆయన చేసిన మేలు, అభివృద్ధి, జన సంక్షేమం గురించి చెప్పుకోకుండా.. నేను ముసలాడినయ్యాను.. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ అడుక్కోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

2019 ఎన్నికల్లోనే ప్రజలు మళ్ళీ చంద్రబాబుకి షాకిస్తారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 2024లో ఇంకా ఘోరమైన పరాజయంతో ఓడిపోతాననే భయంతో ఉన్నారని, ఆయన ఓడిపోతే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమీలేదన్నారు. చంద్రబాబు గతంలో అసెంబ్లీలో వాకౌట్‌ చేసినట్టుగానే 2024 ఎన్నికలకూ దూరం కాబోతున్నారని తేల్చి చెప్పారు. ఉత్తపుత్రుడ్ని పక్కన పెట్టుకుని దత్తపుత్రుడితో ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడించిన రాయబారం ఫలించలేదని, అందుకే తన పుత్రుడితో కలిసి చంద్రబాబు త్వరలో సింగపూర్‌కు పారిపోబోతున్నారని మంత్రి రాజా అన్నారు.ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబే కాదు, ప్రజ‌లు కూడా అదే అనుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రజల్ని విజ్ఞప్తి చేయడానికి బదులు.. తానే ముఖ్యమంత్రిగా వస్తానని చంద్రబాబు అనడమేంటి? అని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం నా హక్కు అన్న ధోరణి కనిపిస్తోందన్నారు.

Read Also: Andhra Pradesh: చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్ల నిధులు.. ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి కేటాయింపు

ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. గతంలో జగన్ ఇదే నినాదం ఎత్తుకుని 2019 ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ ఒకే ఒక్క ఛాన్స్ ఎంత వర్కవుట్ అయిందో వైసీపీ నేతలకు తెలిసినంతగా ఎవరికీ తెలీదనే చెప్పాలి. ఇప్పుడు ఇదే నినాదం పవన్ నోట వినిపిస్తోంది. ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా ముందస్తుగా జరిగే అవకాశముండటంతో గేరు మార్చి వేగాన్ని పెంచారు పవర్ స్టార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మొత్తం మార్చేస్తా అంటూ భారీ రేంజ్ లో పొలిటికల్ డైలాగ్స్ హోరెత్తిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీచేసినా ఓటమి తప్పలేదు. ఒక్క చోట అయినా గెలుస్తానని భావించారు. అయితే ఒక్క సీటుతో రాజోలులో జనసేన గెలిచింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని కాదని, అనధికారికంగా ఫ్యాన్ గాలిలో సేదతీరుతున్నారు. ఉత్తరాంధ్ర మీద ఒట్టు… మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటున్నారు. వైసీపీ నేతల అవినీతిని, దౌర్జన్యాలను ఆయన వేలెత్తి చూపుతున్నారు. టీడీపీతో పొత్తు మాట అటుంచితే.. 2024 ఎన్నికలను ఇజ్జత్ కా సవాల్ లా భావిస్తున్నారు భీమ్లా నాయక్.

ఇదిలా వుంటే.. చంద్రబాబు ఊహించనంతగా కర్నూలు వాసులు సైకిల్ వైపు చూస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు చివరి ఎన్నికలంటూ చేసిన వ్యాఖ్యలు అలా వుంచితే.. జనం ఆయనకు నీరాజనం పడుతున్నారు.. టీడీపీ నేతలు సైతం ఊహించని స్థాయిలో.. ప్రజలు చంద్రబాబు రోడ్ షోకు వస్తున్నారు. దీంతో తెలుగుదేశం కేడర్ ఉత్సాహం రెట్టింపు అవుతోంది. చంద్రబాబు సభలకు వచ్చిన జనం చూస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉందో అర్థమవుతోంది అంటున్నారు టీడీపీ నేతలు. అయితే రాయలసీమలో ఈసారి అన్ని స్థానాలు వైసీపీకే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు చంద్రబాబు మోకాలడ్డారని, అది టీడీపీకి పెద్ద పంక్చర్ కాబోతుందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది వైసీపీ. అయితే రాయలసీమలో మెజారిటీ సీట్లు వైసీపీయే దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికలకొస్తే వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 52 సీట్లలో వైసీపీ 49 గెలుచుకుంది. అటు 8 ఎంపీ సీట్లని కూడా వైసీపీనే గెలుచుకుంది. ఈసారి కూడా రాయలసీమలో సైకిల్ కి ఛాన్స్ వుండదంటోంది ఆ పార్టీ. మొత్తం మీద ఏపీ పొలిటికల్ ప్రీమియర్ లీగ్ 2024లో గెలుపెవరిది? టైటిల్ అనే అధికారం ఎవరికి దక్కబోతోంది అనేది తేలాల్చి వుంది. వైసీపీ నేతలు మాత్రం అధికారం మా స్వంతం.. జగనే మా సీఎం అంటున్నారు. వారి ధీమా అలాంటిది మరి.

Read Also: Saudi Arabia: భారతీయులకు సౌదీ గుడ్ న్యూస్.. వీసా పొందాలంటే ఇకపై ఇది అవసరం లేదు

Exit mobile version