NTV Telugu Site icon

TDP: మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారిన నెల్లూరు రాజకీయాలు..

Tdp

Tdp

TDP: నెల్లూరు రాజకీయాలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాలోని పది స్థానాల్లో పరాజయం పాలైన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో తన బలాన్ని చూపేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. వైసీపీని వీడిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై ఫోకస్ చేసింది. ఈ ముగ్గురిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఈ నెల 13న నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. యువగళం పాదయాత్రను సక్సెస్ చేసేందుకు, టీడీపీకి జోష్‌ తీసుకొచ్చేందుకు ఆ పార్టీ హైకమాండ్‌ కసరత్తు తీవ్రతరం చేసింది.

టీడీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో గంటన్నర పాటు చర్చలు జరిపారు ఆనం రామనారాయణ రెడ్డి. చంద్రబాబు సూచనలతో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, బీద రవిచంద్ర వెళ్లి.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో సమావేశమై చర్చించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రవేశించనున్న లోకేష్‌ పాదయాత్రను సక్సెస్‌ చేయాలని ఆనంను కోరారు. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను ఆనంకు అప్పగించారు. దీంతో నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో సమావేశమై పాదయాత్రపై చర్చించారు ఆనం రామనారాయణరెడ్డి. పాదయాత్ర తర్వాత అమరావతిలో చంద్రబాబు సమక్షంలో తనతో పాటు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా టీడీపీలో చేరతారని రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోనూ అమర్నాథ్‌రెడ్డి, బీదా రవిచంద్ర సమావేశమై చర్చలు జరిపారు. పార్టీలోకి కోటంరెడ్డిని ఆహ్వానించారు. నెల్లూరు రూరల్‌లో లోకేష్‌ పాదయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని కోటంరెడ్డిని కోరారు. రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి రూట్‌ మ్యాప్‌ను రూపొందించే బాధ్యతను కూడా కోటంరెడ్డికే అప్పగించారు. అటు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కడప జిల్లా బద్వేల్‌లో జరుగుతున్న యువగళం పాదయాత్రలో పాల్గొని లోకేశ్‌తో సమావేశమై చర్చించారు. ఉదయగిరిలో టీడీపీ నేతలతోనూ సమావేశమై బేషరతుగా మద్దతు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. వైసీపీ తమదైన వాదన వినిపిస్తోంది. ఎన్నికల్లో గెల్చేందుకు ఎవరితోనైనా కలుస్తారని, ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని చంద్రబాబును ఎద్దేవా చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.

వైసీపీ వాదన ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ….లోకేష్‌ పాదయాత్రకు పూర్తిగా సహకరిస్తామని చెప్పడంతో నెల్లూరు జిల్లా టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ వచ్చింది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలుకానున్న లోకేష్‌ పాదయాత్ర 30 రోజుల పాటు జిల్లాలో కొనసాగనుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలను టీడీపీ తమ వైపు తిప్పుకోవడంతో నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలనూ సైకిల్‌ ఎక్కించేందుకు చర్చలు జరుపుతున్నారు టీడీపీ నేతలు.