మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది. తన ఆరోగ్యం బాగోలేదని అందుకే గ్రామానికి వచ్చానని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. జ్వరం నుంచి కోలుకుంటున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దివారం సాయంత్రం స్వగ్రామం నుంచి ముంబైకి చేరుకున్నారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థికి తాను సంపూర్ణ మద్దతిస్తానని ఆయన ప్రకటించారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే అన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. “ముఖ్యమంత్రి ఎవరో ఇప్పుడు పార్టీ నేతలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా తెలుసు. ఆ వ్యక్తి పేరును మా పార్టీ సీనియర్ నేతలు ధ్రువీకరించాల్సి ఉంది. పార్టీ హైకమాండ్ అధికారికంగా ఆమోదం తెలిపిన వెంటనే ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తాం. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయించుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత.” అని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్..
మరోవైపు.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారని ఓ బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 అక్టోబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. మూడు రోజుల తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2022 నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఫడ్నవీస్ అని తెలుస్తోంది! కానీ.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.