Amrapali: తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల కన్నా పవర్‌ఫుల్‌గా మారారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటికే ఆమ్రపాలి జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, HGCL మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్‌గా కూడా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఆమ్రపాలికి 5 పోస్టులను అప్పగించారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఆమెకు ఐదు కీలక పోస్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అప్పగించింది.
Read Also: Lok sabha: తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు
కాట ఆమ్రపాలి 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివర్లోని ఎన్.అగ్రహారం. ఆమె కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. 2013లో వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సర్కారులో కొన్నాళ్లు వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటీషన్ వెళ్లారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మొదట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాని డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 2020 సెప్టెంబర్‌లో ప్రధాని కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించే వరకు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ సర్కారులో ఆమెకు కీలక పోస్టులు దక్కుతున్నాయి.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా మహానగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. ఆమ్రపాలి విధుల నిర్వహణలో కచ్చితంగా ఉంటారు. అందువల్ల ఆమె జీహెచ్‌ఎంసీ కమిషనర్ అవ్వడంతో అంచనాలు పెరిగాయి.