అభిమానం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఎదురైన ఈ ఘటనే నిదర్శనం. తాజాగా సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో బిగ్ బిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన తన కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో సెల్ఫీల కోసం, షేక్ హ్యాండ్స్ కోసం ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది. జనం ఒత్తిడికి తట్టుకోలేక ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న ఒక భారీ అద్దం ఒక్కసారిగా ముక్కలై పగిలిపోయింది. ఆ సమయంలో అమితాబ్ కొంచెం పక్కకు ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది, లేదంటే ఆ గాజు ముక్కలు ఆయనపై పడి తీవ్ర గాయాలయ్యేవి
Also Read : Jayakrishna : ఘట్టమనేని జయకృష్ణ.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
ఈ ఘటనతో అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి ఆయనను సురక్షితంగా కారులోకి పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలపై అభిమానం ఉండొచ్చు కానీ, అది వారి భద్రతకు భంగం కలిగించేలా ఉండకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి స్టార్ హీరోకైనా ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పకడ్బందీగా ఉండాలని, లేదంటే ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.