కాశ్మీర్ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులు కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించారు. కాశ్మీర్‌లో తీవ్రవాదుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు అమిత్‌షా. జమ్మూకాశ్మీర్ లో ఇవాళ రెండోరోజు తన పర్యటనను కొనసాగిస్తున్నారు కేంద్ర హోంమంత్రి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.
కాశ్మీర్‌లో మైనార్టీలు, వలస కూలీల మీద దాడులు, తీవ్రవాదుల ఎన్‌కౌంటర్లు లాంటి ఘటనల మధ్య.. అమిత్‌షా మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల నౌగామ్‌లో తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీస్ అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని షా పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ అపాయింట్ మెంట్ లెటర్‌ను అహ్మద్ భార్యకు అందించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందన్నారాయన.. జమ్మూ కాశ్మీర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై రాజ్‌భవన్‌లో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో పెరుగుతున్న తీవ్రవాదం, రాడికలిజంతో పాటు సీమాంతర చొరబాట్లు, వలస కూలీలపై కాల్పుల విషయం గురించి షా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించేందుకే టెర్రరిస్ట్ మూకలు దాడులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రభుత్వం ఇటీవలే 50 కంపెనీల అదనపు బలగాలను పంపించింది. శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలుచోట్ల సీఆర్పీఎఫ్ దళాల బంకర్లు ఏర్పాటు చేశారు. కశ్మీర్ లోయలోని పలు రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌లోని జవహర్ నగర్‌లో బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఇక అమిత్‌షా కాశ్మీర్‌కు చేరుకున్న రోజునే శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.