ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (శుక్రవారం) భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ లో అందరి దృష్టి స్పిన్నర్ అశ్విన్‌పైనే ఉంది. ఏడాదిన్నర సుదీర్ఘ కాలం తర్వాత అశ్విన్ వన్డే జట్టులోకి తిరిగి వస్తున్నాడు. అయితే ఈ సిరీస్ లో ప్రదర్శనను బట్టి వరల్డ్‌కప్‌లో ఆడుతాడా లేదా అన్నది తేలిపోతుంది. అయితే అశ్విన్ ఎక్కువగా వన్డేలలో ఆడటానికి అవకాశం దొరకలేదు. దానికి గల కారణాలను వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు. వన్డేలలో ఆడటానికి బౌలింగ్ ఒక్కటే సరిపోదని.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ముఖ్యమని చెప్పాడు. అశ్విన్ మంచి బౌలర్, వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని అన్నాడు. కానీ వన్డేల్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి తీసుకోరని.. 40 ఓవర్ల ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.
Read Also: YV Subbareddy: రాష్ట్ర ఖాజానాను టీడీపీ దోచేసింది
అక్షర్ పటేల్ కు గాయం కావడంతో అశ్విన్ కు వన్డేలో ఆడేందుకు అవకాశం దొరికింది. 6 ఏళ్లలో అశ్విన్ రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. 2022 జనవరిలో దక్షిణాఫ్రికాతో రెండు వన్డేలు ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ టీమిండియా తరుఫున వన్డేలు ఆడలేదు. మరోవైపు అశ్విన్ టెస్టు క్రికెట్‌లో భారత నంబర్‌వన్ స్పిన్నర్‌గా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో అశ్విన్ పోటీపడుతున్నాడు. ఈ సిరీస్‌లో సుందర్‌కు అవకాశం దొరకగా.. ఈ ఇద్దరు బౌలర్లు మూడు వన్డేల్లోనూ ఆడాలని భావిస్తున్నారు. వీరిద్దరిలో ఏ బౌలర్ ప్రదర్శన మెరుగ్గా ఉంటే.. వారికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ ఫిట్ గా ఉంటే ఎలాంటి మార్పులు లేకుండానే ప్రపంచకప్ జట్టులోకి టీమిండియా ప్రవేశించవచ్చు. ఈ నెలాఖరు నాటికి వరల్డ్‌కప్ జట్టుపై స్పష్టత రానుంది.
Read Also: Nipah Virus: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డు