సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుంది సీఎం చంద్రబాబు వ్యవహారం అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పనిచేసేది ఒకరు, క్రెడిట్ పొందేది మరొకరు అని.. క్రెడిట్‌ని దొంగిలించగలగిన సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కుప్పం, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏరోజు రాలేదని.. బాబు ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ జగన్ కుప్పానికి నీళ్లు ఇచ్ఛారన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదని మండిపడ్డారు. పోలవరం డయాఫ్రంవాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఈరోజు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.
‘కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. 1989 నుంచి కుప్పం నుంచే పోటీ చేస్తున్న చంద్రబాబుకు.. నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఏరోజూ రాలేదు. చంద్రబాబు ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26వ తేదీన వైఎస్ జగన్ హంద్రీనీవా నుంచి నీళ్లు ఇచ్చారు. ఇది టీడీపీ గొప్పతనం.. ఇక్కడ జగన్ గారికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కుప్పానికి 720 కిలోమీటర్ల దూరం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పుంగనూరుకు నీళ్లు తీసుకువెళ్లే కార్యక్రమంలో చంద్రబాబు డబ్బులు దండుకునే పనులు చేశారే కానీ.. బ్రాంచ్ కెనాల్ పనులు చేయలేదు. మాట ఇచ్చిన ప్రకారం కుప్పానికి జగన్ నీళ్లు ఇచ్చారు’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Also Read: Rayapati Sailaja: వేధింపులకు గురైనప్పుడు 112, 181కు కాల్ చేయండి.. ధైర్యంగా ఫిర్యాదు చేయండి!
‘లైనింగ్ పేరు చెప్పి సీఎం రమేష్ కంపెనీలకు అప్పనంగా డబ్బులు ఇచ్చారు. కుప్పానికి మళ్లీ మళ్లీ అనే పద్దతిలో చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. వరుసగా కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారే కానీ.. నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కుప్పానికి కూడా స్వహస్తాలతో నీరు విడుదల చేసిన ఘనత వైఎస్ జగన్‌కు ఉంటుంది. కడుపు మంట కొద్ది.. పబ్బం గడుపుకునే కార్యక్రమాలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ప్రపంచంలోనే పోలవరం క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికొదిలేశారు. రెండు కాపర్ డ్యామ్‌లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు. అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది చంద్రబాబే. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేయడం కరెక్టు కాదని కమిటీ చెప్పింది. మొదట్నుంచీ మేము చెప్తున్నది అదే. దీనిపై చర్చకు మేము సిద్దం. కాపర్ డ్యాం లేకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేయాలని చంద్రబాబు అంటున్నారు. అంటే చంద్రబాబుకు అసలు పోలవరం గురించి ఏమీ తెలియదు. గతంలో సోమవారం పోలవరం అన్న చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం ఎందుకు వెళ్లటం లేదు?. ప్రాజెక్టుపై చర్చకు మంత్రి రామానాయుడు సిద్దమా?. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది?. ప్రాజెక్టు నిర్మాణం అంతులేని కథలాగా ఎందుకు మారింది?. నిపుణులు చెప్పినట్లు ప్రాజెక్టును కంప్లీట్ చేయాలి. లేకపోతే దినదిన గండం నూరెళ్ల ఆయుష్షు లాగా మారుతుంది’ అని అంబటి రాంబాబు చెప్పారు.
‘రప్పారప్పా అని పోస్టర్ పెట్టిన యువకుడిని అరెస్టు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు రప్పారప్పా అని ఎలా మాట్లాడారు?. ఏ సీఎం అయినా అనధికార ఇంటిలో ఉంటారా?. కానీ చంద్రబాబు మాత్రమే అక్రమ కట్టడంలో ఉంటున్నారు. రిషికొండ బిల్డింగుపై పవన్, చంద్రబాబు రకరకాల ఆరోపణలు చేశారు. అక్కడి అద్భుతమైన బిల్డింగ్ లు చూసి వారికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. సీలింగ్ ఎలా ఊడిందో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. రిషికొండ భవనాలు అమరావతి బిల్డింగుల్లాంటివి కాదు. సుగాలి ప్రీతి కేసు మీద సీబీఐతో ఎందుకు విచారణ చేయటం లేదు?. దోషులను ఎందుకు అరెస్టు చేయడం లేదు?. పవన్ కళ్యాణ్ సిగ్గు పడాలి. సుగాలి ప్రీతి మరణాన్ని కేవలం జగన్ మీద రాజకీయ ప్రతికారం తీర్చుకోవటానికేనా?. సేనతో సేనానిగానే మిగిలి పోతారా?, ఇక రాజుగా మారరా?. జీవితాంతం చంద్రబాబుకు సేవ చేస్తాడా’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
