Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు

Ambati

Ambati

ఎమ్మార్పీఎస్ నాయకులు తన దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి అనితను తాను పరుష పదజాలంతో విమర్శించానని, కుల దూషణ చేశానని వస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. తాను ఎక్కడా అనుచిత పదజాలం ఉపయోగించలేదని, ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, గతంలో పురాణాల్లో విన్న దారుణాలు ఇప్పుడు నేరుగా రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన దిష్టిబొమ్మలు తగలబెట్టుకున్నంత మాత్రాన తనకు వచ్చే నష్టమేమీ లేదని, గడ్డి తగలబడటం తప్ప తన శరీరానికి ఏమీ కాదని వ్యాఖ్యానించారు.

ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అంబటి తెలిపారు. తాను అనని మాటలను అన్నట్లుగా ఆరోపించి, రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం ధర్మం కాదన్నారు. హోంశాఖ మంత్రికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఆయన, ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ గారు ఏమైనా బాధపడి ఉంటే ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు నేరుగా మాట్లాడకుండా, ఇతరులతో మాట్లాడించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. హోంమంత్రి అనిత గతంలో తనపై, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అత్యంత దారుణంగా మాట్లాడారని గుర్తుచేస్తూ, కావాలని తనపై అనవసర వివాదాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.