Minister Narayana: రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొండవీటి వాగు, పాలవాగు పనులను వేగవంతం చేశామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అమరావతిలో ప్రస్తుతం 69 వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.. గతంలో కొండవీటి వాగు వెడల్పు చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం దానిని 65 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీంతో వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదని, భవిష్యత్తులో నీరు నిలిచిపోయే సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నీటి పారుదల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మరో ఏడాది లోపల రాజధాని ప్రాంతంలో వర్షపు నీటి సమస్యలు లేకుండా సమగ్ర ప్రణాళికతో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. అయితే కేంద్ర కార్యాలయాల నిర్మాణ వ్యయంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల ఖర్చు ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి చదరపు అడుగుకు సుమారు రూ.3,900 అంచనా వ్యయం ఉందని, తమ భవనాల ఖర్చుతో పోలిస్తే దాదాపు రూ.600 ఎక్కువేనని తెలిపారు. అయినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక భవనాలు సాధారణ నిర్మాణాలు కాదని, భవిష్యత్తులో అమరావతి గుర్తింపుగా నిలిచే ఐకానిక్ నిర్మాణాలని నారాయణ పేర్కొన్నారు. అందువల్ల వాటి నిర్మాణ వ్యయం సహజంగానే ఎక్కువగా ఉంటుందని వివరించారు.
దేశ పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం వంటి ప్రతిష్ఠాత్మక భవనాల నిర్మాణంలో కూడా ప్రారంభ అంచనాలతో పోలిస్తే చివరికి ఖర్చులు గణనీయంగా పెరిగాయని మంత్రి గుర్తుచేశారు. అయితే ఆ విషయాలను ప్రస్తావించకుండా కేవలం అమరావతి నిర్మాణాలపై మాత్రమే విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వరద నివారణ చర్యలు అన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయని, అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..

