NTV Telugu Site icon

Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి

Allu Arjun

Allu Arjun

Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్‌ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన పరిణామాలపై దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. అల్లు అర్జు్న్‌ను ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్‌ల సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్‌ ప్రశ్నించారు. దాదాపు 50కి పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు పోలీసులు ఉంచారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు పోలీసులు చూపించారు. ఆ రోజు రాత్రి 9.30 గంటల నుంచి సంధ్య థియేటర్ బయటకు వెళ్లేవరకు ఏం జరిగిందనే దానిపై ప్రశ్నలు అడిగారు.

Read Also: Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!

అల్లు అర్జున్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని పోలీసులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అల్లు అర్జున్‌ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా అల్లు అర్జున్‌ సైలెంట్‌గానే ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో పుష్ప-2 బెనిఫిట్‌ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి అల్లు అర్జున్ కారణమయ్యాడనే అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేసిన ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు.