Bhavani Deeksha: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి కరుణ కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారనే సంగతి తెలిసిందే. నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్లుండి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు వస్తారని అంచనా. దుర్గగుడి అధికారులు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎల్లుండు ఉదయం 6:30 గంటల నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్నాయి.
Read Also: Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
పున్నమి, కృష్ణవేణి, సీతమ్మ పటదాలు ఘాట్లలో జల్లు స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేశఖండన శాల, క్లాక్ రూంలను సిద్ధం చేశారు. ప్రతీ అరగంటకు ఉచిత బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్యం, భవానీల వస్త్రాల సేకరణ కోసం ఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. భవానీలకు అమ్మవారి కుంకుమ, అన్నప్రసాదాన్ని దుర్గగుడి అధికారులు, పాలకమండలి అందించనున్నారు. మెడికల్ క్యాంపులను వినాయకుడి గుడి వద్ద నుంచి, మెట్ల మార్గం వైపు, గిరిప్రదక్షిణ చేసే దగ్గర ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో, గిరిప్రదక్షిణ మార్గంలో మజ్జిగ, పాలు, నీళ్లను అధికారులు అందించనున్నారు.