శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో యువశక్తి సభకు సర్వం సిద్దమైంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువశక్తి సభకు యువత తరలివస్తోంది. పవన్ కళ్యాణ్ సభ కోసం 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో ఏర్పాట్లు చేసారు. పవన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణంలోనే ఉండనున్నారు. మరోవైపు సభా వేదికపై యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ తీర్మానాలు చేస్తారని జనసేన నేతలు అంటున్నారు.
Read Also: Ukraine Crisis: ఆ క్షిపణులతో ఉక్రెయిన్ ఈ ఏడాది యుద్ధంలో విజయం సాధించగలదు..
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. రణస్దలం సమీపంలో యువశక్తి పేరిట నిర్వహిస్తున్న ఈ సభను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. పవన్ పర్యటన ఏర్పాట్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు దగ్గరుండి పర్యవేక్షించారు.
యువశక్తి సభకు సుమారు లక్షమంది వరకూ యువకులు హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. వేదికపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరో వందమంది వరకూ యువకులు ప్రసంగించే విధంగా ఏర్పాట్లు చేసారు. ఉత్తరాంధ్ర యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు స్దానికంగా ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ వేధిక ద్వారా ఎండగట్టనున్నారు. ఉదయం 12 గంటలకు జనసేన నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం రెండుగంటలకు పవన్ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారు. యువశక్తి సభపై విమర్శలు చేస్తున్న వైసేపీ నేతలపై జనసేన నేత నాగబాబు తీవ్ర స్ధాయిలో రియాక్ట్ అయ్యారు. వైసీపీ నేతలకు పనీ పాట లేదన్నారు. రాజకీయ విమర్శలు తప్పా వైసీపీ నేతలకు పాలన చేతకాదన్నారు. మరోవైపు యువశక్తి సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే యువత కోసం భోజన ఏర్పాట్లు చేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ అక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. జీఒ 1 కి అనుగుణంగా సభ నిర్వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే జనసేన నేతలు మాత్రం ఆంక్షలు విధిస్తే చూస్తూ ఊరుకోబోమంటున్నారు. మొత్తం రణస్థలం.. రాజకీయ విమర్శలకు రణంగా మారింది.
Read Also: Veera Simha Reddy: నంద్యాలలో టెన్షన్.. కాసేపు నిలిచిన వీరసింహారెడ్డి మూవీ