Andhrapradesh: ఏపీలో బీసీ సమస్యలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల ఓట్లు తొలగించి, వారి పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వే చేస్తోందని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో బడుగు బలహీనులు మళ్లీ బతికి బట్టకట్టాలంటే తెలుగుదేశం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. జగన్ సీఎం అయిన నాటి నుంచీ బడుగు బలహీన వర్గాలపై దమన కాండ జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో దేశమంతా ఓ సారి చూడాలన్నారు. కుంభకర్ణుడు గాఢ నిద్ర వదిలినట్లు ఎన్నికల సమయంలో జగన్ నిద్ర లేచి బీసీల జపం చేస్తున్నాడన్నారు. నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాని పదవులు బీసీలకిచ్చారని.. బీసీలను అవహేళన చేసేలా ఇచ్చిన పదవులపై ప్రతీ ఒక్కరూ కళ్ళు తెరవాలన్నారు.
Also Read: Chittoor: అనుమానంతో వేడి నూనెలో చెయ్యి పెట్టాలన్న భర్త .. అందుకు భార్య ఏం చేసిందంటే..?
బీసీల అభ్యున్నతే ప్రధాన అజెండాగా తెలుగుదేశం – జనసేన మేనిఫెస్టో ఉంటుందని తెలుగుదేశం బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీలను మళ్లీ మోసగించేందుకే సామాజిక బస్సు యాత్ర చేపట్టారన్నారు. బీసీలను ఓట్లు అడిగే నైతిక అర్హతను వైసీపీ నేతలు కోల్పోయారన్నారు. బీసీల దమ్మేంటో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రికి తెలిసొచ్చేలా చేద్దామన్నారు.
తెలుగుదేశం – జనసేన అధికారంలోకి రావాలని సీపీఐ నేతగా కోరుకుంటున్నానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ-సీపీఎం కూడా అసెంబ్లీలో ఉంటేనే ప్రశ్నించే గొంతుకలుండి అధికార పక్షం సక్రమంగా నడుస్తుందన్నారు. వైసీపీని నడిపే నలుగురు కీలక నేతలు జగన్ సామాజిక వర్గమేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టిన వైసీపీ సిగ్గు లేకుండా సామాజిక సాధికార యాత్ర అంటున్నారని ఆయన విమర్శించారు. కీలకమైన ఒక పోస్టయినా బీసీ, ఎస్సీలకు ఇచ్చి వారికి జగన్ విలువ ఇచ్చాడా అంటూ కె. రామకృష్ణ ప్రశ్నించారు.