Site icon NTV Telugu

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం.. ప్రచార హోరుకు సమాయత్తం

Telangana

Telangana

Lok Sabha Elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నాయకుల్లో మాత్రం జోరు కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వలసల బాట పడుతున్నారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారు సైతం పార్టీని వీడటంతో కార్యకర్తల్లో అసహనం మొదలైంది. బీజేపీ నాయకులు మోడీ గ్యారంటీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

కాంగ్రెస్‌ దూకుడు..
రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని నాయకులు నిర్ణయించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులపై కన్నేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి ముఖ్య నాయకుడు కడియం శ్రీహరితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. మరోవైపు పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు జితేందర్‌ రెడ్డి సైతం హస్తం పార్టీలో చేరారు. అభ్యర్థుల ఎంపికలో సైతం హస్తం పార్టీ చాకచక్యంగా వ్యవహరించింది. ఇలాంటి పలు అంశాలు కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే కొన్ని సీట్లు పెరిగేందుకు ఇవి దోహదపడతాయి.

బీఆర్‌ఎస్‌ పరిస్థితి..
రాష్ట్రంలో దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ అధికారం కోల్పోయాక చతికల పడింది. ఆ పార్టీ అగ్రనాయకుడు సైతం కొన్ని రోజులు పలు కారణాలతో బయటకు రాని పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం కేసీఆర్‌ కుమార్తె కవిత అరెస్టు కలకలం రేపింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కవిత అరెస్టుతో ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్‌ కుటుంబంపై జనాల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ నేఫథ్యంలో ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు కలిసి రాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా నమ్మకం కోల్పోయి క్రమంగా పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ గతంలో కంటే తక్కువ సీట్లు సాధిస్తుందని రాజకీయ వర్గాల అంచనా.

బీజేపీ మేనిఫెస్టో ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు రూ.2.15 లక్షల కోట్లతోపాటు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారని ఆయన తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే అంశాన్ని ప్రజల్లోకి బాగా చొప్పిస్తూ.. ఓట్లు అర్జిస్తున్నారు. మేనిఫెస్టోలోని పథకాలతో పాటు, 370 ఆర్టికల్‌ రద్దు, రామమందిరం వంటి పలు అంశాలు పార్టీకి కలిసొచ్చినా.. నాయకుల మధ్య సమన్వయం లోపించిందని పలువులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో కంటే ఒకటి రెండు సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు.

Exit mobile version